ఇటీవల బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగిన 67వ ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలుగు చిత్రం పుష్ప ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు.
దీనిపై ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప చిత్రం క్లీన్ స్వీప్ చేయడం అభినందనీయం అని తెలిపాడు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ను ఎంపిక చేయడం మంచి నిర్ణయం అని పేర్కొన్నాడు. పుష్ప చిత్రం తమకు ఎంతగానో నచ్చిందని వార్నర్ వెల్లడించాడు.
పుష్ప యూనిట్ సభ్యులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుకుంటున్నట్టు వివరించాడు. అంతేకాదు, తాను పుష్ప గెటప్ లో ఉన్న తన మార్ఫింగ్ ఫొటోను కూడా వార్నర్ పంచుకున్నాడు.
ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప చిత్రం ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులను సైతం కైవసం చేసుకుంది.
కాగా, డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలంటే పడిచచ్చిపోతాడన్న సంగతి తెలిసిందే. ఈ ఆసీస్ విధ్వంసక ఆటగాడు టాలీవుడ్ స్టార్ హీరోలను అనుకరిస్తూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. అభిమానులను ఈ వీడియోలు ఎంతగానో అలరిస్తుంటాయి.