వార్తల కోసం గూగుల్, ఫేస్బుక్ మీడియా సంస్థలకు డబ్బులు చెల్లించడాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకం చట్టం తయారు చేస్తున్నామని ప్రకటిస్తూ… బిల్లు డ్రాఫ్ట్ ను ప్రకటించింది.
ఇందుకోసం తెచ్చిన న్యూస్ మీడియా బార్గైనింగ్ కోడ్ ను తొలుత పార్లమెంటరీ కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తుందని, ఆ తర్వాతి వచ్చే ఏడాది దీనిపై చట్ట సభ్యులు ఓటు వేస్తారని తెలిపింది. ఇలా వార్తా సంస్థలకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఓ ప్రభుత్వం ఇవ్వటం ఇదే మొదటిసారి. దీంతో ఆస్ట్రేలియా తీసుకొస్తున్న ఈ అతిపెద్ద సంస్కరణను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
అయితే, ఈ చట్టం తెచ్చే ముందు అనేక డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్, ఆస్ట్రేలియా మీడియా సంస్థలతో విస్తృత సంప్రదింపులు జరిపింది అక్కడి ప్రభుత్వం. ఆ తర్వాతే ఈ డ్రాఫ్ట్ రెడీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ఈ కొత్త చట్టంపై గూగుల్, ఫేస్ బుక్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. డబ్బులు చెల్లించే బదులు ఆస్ట్రేలియా వార్తల కంటెంట్‌ను నిషేధిస్తామని ఎఫ్బీ హెచ్చరించగా, ఈ చట్టానికి ఆమోదం లభిస్తే.. గూగుల్ సెర్చ్‌తో పాటు యూట్యూబ్ సేవలు ఆధ్వానంగా ఉంటాయని గూగుల్ తేల్చి చెప్పింది.