తమ పౌరులకు కొవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోసును పంపిణీ చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలో 65 ఏండ్లకు పైబడిన వారికి ఏప్రిల్ లో నాల్గవ డోసును అందించనున్నట్టు ఫెడరల్ వైద్యాధికారులు వెల్లడించారు.
ఇటీవల ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ2 తో కేసులు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
దేశంలో 65 ఏండ్లకు పైబడిన, 50 ఏండ్లు దాటిన స్వేదేశీయులకు వ్యాక్సిన్ ఫోర్త్ డోసు ఇవ్వాలని ఇటీవల వ్యాక్సిన్లపై నియమించిన ఉన్నత స్థాయి సలహా సంఘం సూచనలు చేసింది.
దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ మాట్లాడుతూ… అదనపు డోసు ఏప్రిల్ 4 నుంచి అందుబాటులో ఉంటుందన్నారు. పంపిణీ నాటికి మూడో డోసు తీసుకుని నాలుగు నెలలు గడిచిన వారికి ఈ డోసు ఇవ్వనున్నట్టు తెలిపారు.
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అత్యధికంగా టీకాలు వేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 16 ఏండ్లు పైబడిన వారిలో 95 శాతం మందికి ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్ డోస్‌లను అందించింది. దాదాపు 67 శాతం మందికి మూడవ లేదా బూస్టర్ షాట్స్ ను ఆస్ట్రేలియా అందించింది.