ఆస్ట్రేలియా ప్రధాని అంటోని అల్బేనిస్ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 8న ఆయన భారత్ కు రానున్నారు. భారత్ లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) ఒప్పందాన్ని చేసుకోవడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆయన భారత్ లో పర్యటించనున్నారు.
ఈ మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ అల్బనీస్ మార్చి 08 నుంచి11 వరకు భారతదేశ పర్యటనకు రానున్నట్టు పేర్కొంది. ఆయనతో పాటు వాణిజ్య మంత్రి సెనేటర్ డాన్ ఫారెల్, , పర్యాటక శాఖ మంత్రి మడేలిన్ కింగ్ కూడా రానున్నట్టు తెలిపింది.
ప్రధాని హోదాలో అల్బనీస్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. ఆయన మార్చి 8 (హోళీ) రోజున అహ్మదాబాద్ చేరుకుంటారు. మార్చి 9న ఆయన ముంబైలో పర్యటిస్తారు. మార్చిన 10న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ నెల 10న ఆయన రాష్ట్రపతి భవన్ చేరుకుంటారని, అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద పలు రంగాల్లో సహకారంపై ఇద్దరు ప్రధాన మంత్రులు చర్చిస్తారని వెల్లడించింది.