– ఆన్‌లైన్ లో నమోదు చేయాలని షరతు
– ట్రాఫిక్ పోలీసుల కొత్త నిర్ణయం
– రాజధానిలో పెరిగిన వాహన కాలుష్యం
– కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణ శాఖ కీలక నిర్ణయం
రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనను తీసుకొచ్చారు. వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం పరిమితులకు లోబడే ఉందంటూ.. రోడ్ల పక్కన ఉండే వ్యాన్లు ఇచ్చే ధ్రువపత్రాలు ఇకపై చెల్లవని చెప్తున్నారు. కాలుష్య ధ్రువపత్రం పొందిన వాహనం రిజిస్ట్రేషన్ నంబరు ఆన్‌లైన్ ద్వారా రవాణా శాఖ సర్వర్, ట్రాఫిక్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కు ఏకకాలంలో చేరితేనే ధ్రువపత్రానికి విలువ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ అధికారులు.
వాహన కాలుష్య పరిమితి ధ్రువపత్రాలను ప్రస్తుతం రవాణాశాఖ అనుమతి పొందిన ఏజెన్సీలు, సంచార వాహనాలు ఇస్తున్నాయి. ఈ విధానంలో అక్రమాలకు తావులేకుండా అన్ని సంచారవాహనాలు ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాలని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీ, బెంగుళూరులో ఏడేళ్లుగా ఈ విధానం అమలవుతోందని తెలిపారు.
ఓ పోలీస్ అధికారి గత నెల తన వాహనానికి కాలుష్య ధ్రువీకరణ పరీక్ష చేయించారు. జారీ చేసిన పత్రంపై గడువు నవంబరు 2022 వరకు ఉండాల్సి ఉండగా.. నవంబరు 2023 వరకూ చెల్లుబాటయ్యేలా ఇచ్చారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు తెలుస్తోంది.
అయితే.. రవాణా శాఖ ద్వారా అనుమతి పొందిన ఏజెన్సీలు వాహన కాలుష్యం పరిమితిలోపే ఉందంటూ.. పీయూసీ పేరుతో వాహనాలకు ధ్రువపత్రాలు ఇస్తున్నాయి. ఆటోవాలాలు 70 శాతం మంది, ద్విచక్ర వాహనదారుల్లో 40 శాతం మంది వాహనాలను తనిఖీ చేయించుకోకుండానే ధ్రువపత్రాలను తీసుకుంటున్నారు. దీనివల్ల పదేళ్లకు పైబడిన వాహనాల నుంచి కూడళ్లలో వాహనాల నుంచి భారీగా పొగ వెలువడుతోంది. వాహనాల నుండి వచ్చే పొగతో వాతావరణంలో కాలుష్యం ఏర్పడుతోందంటున్నారు అధికారులు.
కాలుష్య ధ్రువపత్రం జారీచేసే ప్రతి సంచార వాహనంలో అంతర్జాల ఆధారిత కంప్యూటర్ ఉందంటున్నారు. ధ్రువపత్రం పొందిన ప్రతీ వాహనం వివరాలు ఆన్ లైన్ లో నమోదు కాగానే.. రవాణా శాఖ సర్వర్ కు.. అక్కడి నుంచి ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూంకు చేరుతుందన్నారు. దాని నుండి రోడ్లపై ట్రాఫిక్ విధుల్లో ఉండే పోలీసుల పీడీఏ యంత్రాలకు వెళ్తుందని తెలిపారు.
ఇలా చేయడం వల్ల తనిఖీలు చేసేటప్పుడు వాహన నంబరు నమోదు చేయగానే కాలుష్య పరిమితి ధ్రువపత్రం ఉందా..? లేదా..? అనేది వెంటనే తెలిసిపోతుందని వివరించారు. ప్రస్తుతం ఆన్‌లైన్ విధానం లేకపోవడంతో కొందరు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా కాలుష్య ధ్రువీకరణ పత్రాలిస్తున్నారని తెలిపారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చేవారి అనుమతుల రద్దుకు నిర్ణయం తీసుకున్నట్టు రవాణ శాఖ అధికారులు వెల్లడించారు.