హైదరాబాద్ మహానగరంలో ప్రజారవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవరిస్తున్న ఎంఎంటీఎస్ రైళ్ల సేవలను రద్దు చేసింది దక్షిణమధ్య రైల్వే. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు అధికారులు.
అయితే.. పనులు ఇంకా కొనసాగుతుండడంతో సోమవారం కూడా రైళ్ల సేవలను నిలిపివేశారు. జంట నగరాల్లో మొత్తం 79 ఎంఎంటీఎస్ సర్వీసులు కొనసాగుతుండగా.. సోమవారం పలు రూట్లలో 36 సర్వీసులను నిలిపివేశారు రైల్వేశాఖ అధికారులు.
సికింద్రాబాద్-లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య 2(1-1) సర్వీసులను.. లింగంపల్లి-నాంపల్లి-లింగంపల్లి మధ్య 18(9-9) సర్వీసులను.. ఫలక్‌నుమా-లింగంపల్లి-ఫలక్ నుమా మధ్య 16(8-8) సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
దానికి సంబందించి ఆదివారం ప్రకటన విడుదల చేశారు రైల్వే అధికారులు. ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు తెలిపారు. రైళ్ల పునరుద్ధరణపై సోమవారం సాయంత్రం లేదా.. మంగళవారం మరో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.