తెలంగాణకు చెందిన ఇంజినీర్ మానస వారణాసి ఇటీవల జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీల్లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా హర్యానాకు చెందిన మణికా షివోకాండ్ ను వీఎల్‌సీసీ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020 కిరీటం వరించింది. అలాగే మాన్య సింగ్ అనే యువతి ఈ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది.
అయితే నిజానికి మాన్య సింగ్ ఓ ఆటో రిక్షాడ్రైవర్ కుమార్తె. ఉత్తరప్రదేశ్ వాసి. ఆమె ఆ పోటీల్లో ఆ స్థానంలో నిలిచేందుకు ఎంతగానో కష్టపడింది. ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపింది. ఎన్నో ఏళ్ల పాటు కఠినంగా శ్రమించింది. ఈ క్రమంలో తన విజయానికి కారణాలను కూడా ఆమె తెలిపింది. మిస్ ఇండియా అనే ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఇతరుల్లో స్ఫూర్తి నింపడానికి తాను పనిచేస్తానని తెలిపింది.
నా రక్తం, నా చెమట, నా కన్నీళ్లు.. వెరసి నా కలను సాకారం చేసుకునేందుకు కావల్సిన ధైర్యాన్ని నాలో నింపాయి.. అని ఆమె పేర్కొంది. అందుకు సంబంధించిన పోస్ట్‌ను మిస్ ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గత డిసెంబర్ నెలలో పోస్ట్ చేశారు.
కుషినగర్ అనే ప్రాంతంలో జన్మించిన మాన్య తాను ఈ విజయం సాధించేందుకు ఎంతగానో కష్టపడ్డానని తెలియజేసింది. ఒక్కో రోజు రాత్రి తినేందుకు తిండి ఉండేది కాదని, నిద్ర పోలేదని, కొన్ని రూపాయలు పొదుపు చేసేందుకు ఎన్నో మైళ్ల దూరం నడిచానని తెలిపింది. అయితే అందంలోనే కాదు, ఆమె చదువుల్లోనూ ప్రతిభ చాటింది. హెచ్ఎస్సీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు పొందింది. ఆమె ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలు పడింది. స్కూల్ ఫీజు కట్టేందుకు కూడా అప్పట్లో డబ్బులు ఉండేవి కావు. అయినప్పటికీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది.
మాన్య సింగ్ తన చదువుల కోసం అయ్యే ఖర్చులకు గాను ఇండ్లలో గిన్నెలను తోమేది. రాత్రి పూట కాల్ సెంటర్లలో పనిచేసేది. ఆయా ప్రదేశాలకు నడిచి వెళ్లేది. దీంతో కొన్ని డబ్బులు అయినా సరే పొదుపు అవుతాయని ఆమె అలా చేసేది. ఈ విషయాలను ఆమే స్వయంగా వెల్లడించింది. కాగా ప్రస్తుతం ఆమె మేనేజ్‌మెంట్ లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు యత్నిస్తోంది. మీరు కష్టపడి మీ లక్ష్య సాధనకు కృషి చేయండి, మీ తల్లిదండ్రులు మీ గురించి చూసుకుంటారు.. అని ఆమె సందేశం ఇచ్చింది. ఇతరులకు ఆమె ప్రేరణగా నిలుస్తోంది.