(రాజమౌళి)
అంతా ఆర్ధిక మాంద్యం ఆర్ధిక మాంద్యం వచ్చింది అంటున్నారు. నేను ఆర్ధిక నిపుణుడిని కాను. అయితే నన్ను నేను పరీక్షించుకొంటే నిపుణుల అభిప్రాయాలు కొంతవరకు నిజం కావచ్చు అనిపించింది.
నా మటుకు నేను..
సబ్బులు షా0పులు వాడకం బాగా తగ్గించాను. పూర్తిగా చన్నీళ్ల తోనే స్నానం చేస్తున్నాను. ఉన్న అరగుండు(బట్టతల)ను పూర్తిగా షేవ్ చేసేసి ప్రతి రోజు చన్నీళ్ల తల స్నానం చేస్తున్నా. మెదడు చల్లగా ఉంటోంది. చన్నీటి స్నానం వల్ల కరెంట్/గ్యాస్ ఆదా అవ్వటమే కాకుండా చెమట పట్టటం కూడా తగ్గింది. (దానిపై కూడా మాంద్య ప్రభావం పడిందేమో?)
పాలు, కాఫీ, టీ కూల్ డ్రింకులు లాంటివి పూర్తిగా మానేశాను. మంచి నీళ్ళు 4 గ్లాసులు ఎక్కువ తాగుతున్నాను. ఎసిడిటీ లాంటి సమస్యలు పూర్తిగా తగ్గాయి. యాంటాసిడ్ మందుల ఖర్చు తగ్గింది.
అనవసర ప్రయాణాలు బాగా తగ్గించాను.. ఒక కిలోమీటర్ వరకు నడిచి వెళ్తున్నాను.. ఐదు కిలోమీటర్ల వరకు సైకిల్ వాడుతున్నాను. దూరాలకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం బాగా పెంచాను. అనవసర బాదరబందీ లేకుండా స్వాతంత్రం వచ్చినట్లుగా ఉంది.
బయట తినటం, కొనటం తగ్గించాను…చిరుతిళ్లు ఇంటిలో చేసుకోవటం ఆరంభించాను. పిల్లలు కూడా ఇంట్లొవే బాగున్నాయంటున్నారు వాళ్ళు కూడా నేర్చుకుంటామంటున్నారు. కొన్నేళ్లుగా తినటం మానేసిన ఊరగాయలు, నల్ల కారం.. కరివేపాకు పొడులు వాడటం ఆరంభించాను. ఆకలి ఆనందం, నాలుకకు రుచి తెలియటం మొదలైంది. నూనెలు కూరగాయలు అవసరమైనంత వరకే జాగ్రత్తగా వాడటంతో భోజనం అయిన తర్వాత అనాయాసంగా అనిపించడం, డెటాల్ హాండ్ వాష్ తో చేతులు రుద్ది కడగడం (కొనటమే మానేశా), మిగిలిన కూరల్ని చద్దిపెట్టి(అదేనండి ఫ్రిజ్)లో పెట్టి ఎవరన్నా వస్తే ఓవెన్‌లో వేడి చేసి పెట్టటం, ఎవరూ రాకపోతే మరుసటి రోజు నేనే తినటం.. ఇవన్నీ బంద్ అయిపోయాయి. బరువు కూడా కాస్త తగ్గినట్లుగానే ఉన్నా.
కూరగాయలు, పళ్ళు, వేరుశనగ కాయలు, ఆకు కూరలు రైతు నుంచే చాలా సరసమైన ధరకు కొంటున్నాను.. ఉభయ తారకంగా ఉంది…మరిచిపోయిన, కూరగాయల, పళ్ళ, మట్టి వాసనలు నెమరు వేసుకోగల్గుతున్నాను.
బట్టలు చిరిగితే పారవేయకుండా, మళ్లీ కొత్తవి కొనకుండా టైలర్ దగ్గర కుట్టించుకుని (అతనికి తృణమో పణమో ఇచ్చే సుమా) వేసుకుంటున్నాను.. బయటికి వెళ్ళినపుడు బట్టలు ఎక్కువ మురికి కాకుండా జాగ్రత్త పడుతున్నాను. సొంతంగా ఉతుక్కునేప్పుడు సమయం, శ్రమ, నీరు,సబ్బు, సర్ఫ్ పౌడరు అన్నీ తగ్గి ఆదా అవుతున్నాయి.
ఇంటి నుంచి బయలుదేరినపుడు మంచి నీటి సీసా కూడా తీసుకెళ్తున్నాను. బయట తాగినట్లు సగం సీసా తాగి వదిలి పెట్టటం లేదు. ఇంటికి వచ్చే సరికి మొత్తం సీసా ఖాళీ అవుతోంది. (మోతబరువు గిట్టాలని నేను ప్రయత్నపూర్వకంగా ఖాళీ చేస్తూ, అప్రయత్నంగా నీరు ఎక్కువ తాగాలన్న డాక్టర్ సలహాను పాటిస్తున్నాను అనుకుంటాను)
ఏసీ వాడకం ఆపేశాను. పగలంతా ఫ్యాన్ లేకుండా (చిరు చెమట ఒళ్ళంతా పడుతుంటే ) కిటికీలన్నీ తెరిచి పనిచేసుకుని, ఒకరిద్దరు ఇరుగు పొరుగులు కనపడుతుంటే చిరునవ్వులతో పలకరిస్తూ ఎండా, వానా, గాలీ సహజంగా ఆస్వాదించటం మళ్లీ ఆరంభించాను. పగలంతా ఫ్యాన్ లేకుండా పని చేసుకోవటం వల్ల రాత్రి ఫ్యాన్ వేసుకు పడుకుంటే. (ఏసీ వెయ్యకపోయినా) గాఢంగా, హాయిగా నిద్ర పడుతోంది. కరెంటు బిల్ సగానికి తగ్గింది. సూర్యుడి వెలుతురులో వీలైనంత ఎక్కువ సేపు చదువుకొంటున్నాను. విద్యుత్ వెలుగులో కళ్ళజోడు అవసరం అవుతోంది. సూర్యరశ్మిలో జోడు లేకుండానే పని జరుగుతోంది.
అయితే రోజులు గడుస్తున్నా కొద్దీ ఇవన్నీ నా చుట్టూ ఉన్న పర్యావరణానికి, నా అహం తగ్గటానికి, ఆరోగ్యానికి, ఆదాయానికి, మానసిక సంతృప్తికి దోహదం చేస్తున్నట్లుగా అనిపించింది. అంటే కొన్నిసార్లు మరకలాగా మాంద్యం కూడా మంచిదేనా !!!. ఏమో!! నా అనుభవంలో ఇది మనకాళ్లపై మనం నిలబడేలా చేస్తుంది అనిపించింది. మాంద్యం అంటే పరిగెడుతున్న ఆర్ధిక వ్యవస్థ కాసేపు ఆగి ఆత్మావలోకనం చేసుకుని, వాస్తవాలు గమనించి తన గమన దశ దిశ లను బేరీజు వేసుకుని కాసేపు ఊపిరి పీల్చుకోవటమేననిపిస్తుంది. భూమాత కాస్త నెమ్మదించి మనల్ని కూడా నెమ్మదించి నిగ్రహం పెంచుకోమన్నట్లు తోస్తుంది నాకు..