ఉత్తరాఖండ్‌లో హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో శిక్షణలో ఉన్న పర్వతారోహకులు పది మంది మరణించారు. 16వేల అడుగుల ఎత్తున్న ద్రౌపది కా డాండా శిఖరాన్ని అధిరోహిస్తుండగా భారీ హిమపాతం సంభవించింది. ఆ సమయంలో పర్వతంపై 29 మంది శిక్షణలో ఉన్న పర్వతారోహకులు ఉన్నారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. హిమపాతంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాను రక్షణ, సహాయక చర్యలు చేపట్టారు. సహాయక బృందాలను రంగంలోకి దించారు. భారత వాయిసేన హెలిక్యాప్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టింది.
ఇప్పటి వరకు 8 మందిని సహాయక బృందాలు ప్రాణాలతో కాపాడాయి. 10 మంది మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. మిగిలిన 11 మంది కోసం ఇంకా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. పర్వతారోహకులు ఉత్తర కాశీలోని నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఉత్తరాఖండ్ హిమపాతం ఘటనలో మృతులకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. హిమపతంలో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగి రావాలని ఆయన కోరుకున్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.