జమ్మూకశ్మీర్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్ మార్గ్ లో గల స్కీ రిసార్ట్ ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.
ఒక్కసారిగా మంచు ముంచెత్తడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని బారాముల్లా పోలీసులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
కశ్మీర్ ప్రాంతంలో అవలాంచులు ఏర్పడటం ఇది మొదటిసారేమీ కాదు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇటీవల ప్రముఖ హిల్ స్టేషన్ సోనామార్గ్ లో అవలాంచ్ ఏర్పడింది.
అయితే అప్పుడు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం గమనార్హం. గత నెలలో టిబెట్ లోని నైరుతి ప్రాంతాన్ని అవలాంచ్ ముంచెత్తింది. అక్కడ భారీ ఎత్తున హిమపాతం ముచెత్తడంతో 8 మంది మరణించారు.