రాజమహేంద్రవరం : గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీకి పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్ వశిష్ట బోటును ప్రయివేట్ వ్యక్తి నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతున్నట్టు చెప్పారు. బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ వెంటనే రంగంలోకి దిగింది.
సహాయక చర్యలకు హెలికాఫ్టర్
సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా పర్యాటక శాఖ విభాగం నుంచి రెండు బోట్లను సంఘటనా స్థలానికి పంపించారు. అలాగే సహాయక చర్యల కోసం మంత్రి అవంతి విశాఖలోని నేవీ అధికారులతో మాట్లాడారు. నేవీ హెలికాఫ్టర్‌తో పాటు అధునాతన బోట్లను ఘటనా స్థలానికి పంపించాలని కోరారు. లాంచీ మునకకు వరద ఉధృతే కారణమని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరిగాయి. ఉదయభాస్కర్, ఝాన్సీరాణి అనే బోట్లు ప్రమాదానికి గురై అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై హోంమంత్రి సుచరిత ఆరా తీశారు. సహాయక చర్యలపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గల్లంతు అయినవారి కోసం గాలించి సరక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.