పలుమార్లు వాయిదావేస్తూ వస్తున్న అవతార్ సినిమా సీక్వెల్ కు కొత్త తేదీ ప్రకటించారు. ఈ ఏడాదిలోనే అవతార్ -2 రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 16న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చింది అవతార్ సినమా. ఆ తర్వాత ఐదేళ్లకే సీక్వెల్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. గతేడాది రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల సాధ్యం కాలేదు. అలా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి సీక్వెల్ ను ఈ ఏడాది డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఇక అవతార్-3ను 2024లో.. అవతార్-4 ను 2026లో.. చివరిదైన అవతార్-5ను 2028లో విడుదల చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. అవతార్ లో నటించిన నటీనటులంతా సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు. అయితే వీళ్లతో పాటు ఈసారి టైటానిక్ బ్యూటీ కేట్ విన్ స్లెట్, కండల వీరుడు విన్ డీజిల్, మరికొంతమంది నటీనటులు ఎంటరయ్యారు.
పండోర అనే గ్రహంపై ఉన్న పండోరా జాతిని అవతార్ లో చూపిస్తే, సీక్వెల్ లో అదే పండోర గ్రహంలో నీటి అడుగున ఉండే మెటికైనా అనే తెగను చూపించబోతున్నాడు దర్శకుడు. అత్యాథునిక టెక్నాలజీ సహాయంతో, కనీవినీ ఎరుగని గ్రాఫిక్స్ తో, విజువల్ వండర్ గా రాబోతోంది అవతార్-2.