చిన్నారి పెళ్లికూతురుగా అలరించి, ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మెప్పించింది అవికా గౌర్. ఇప్పుడీ ముద్దుగుమ్మ నిర్మాత అవతారం ఎత్తింది. పాప్ కార్న్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించడంతో పాటు, ప్రొడ్యూసర్ గా కూడా మారింది. ఈ నిర్ణయంపై స్పందించింది ఈ చిన్నది.
“పాప్ కార్న్ కథ వినగానే, నా పరంగా ఎక్కువ టైమ్, అటెన్షన్ ఇవ్వాల్సిందేనన్న విషయం అర్థమైంది. నటిగా సెట్‌కి వెళ్లి చెప్పింది చేసి వచ్చేస్తాం. కానీ నిర్మాతగా అయితే, అన్నీ విషయాలనూ పట్టించుకుంటాం. సినిమా ఎలా రావాలి? ఎలా ప్రమోట్ చేయాలి? స్క్రిప్ట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలంటే ఇంకేం చేయొచ్చు… ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. నేను నిర్మాతని కావాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఈ సినిమా కథ వినగానే, ఇదే పర్ఫెక్ట్ టైమ్ అనిపించింది. అందుకే ఫస్ట్ స్టెప్ వేశాను.”
ఇలా తను తెలుగులో నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందో వివరించింది అవికా గౌర్. తన నిర్ణయాన్ని ఇంట్లో చెబితే, వాళ్ల రియాక్షన్ ఏంటనే విషయాన్ని కూడా బయటపెట్టింది.
“నిర్మాతనవుతానని నేను చెప్పగానే, చేయగలవంటావా? అని అడిగారు నాన్న. ఎందుకంటే నేను సినిమాల్లోకి వస్తానంటే వాళ్లు నన్ను ఎప్పుడూ వద్దని చెప్పలేదు. అలాగని మాకు సినిమాల్లో బంధువులెవరూ లేరు. గాడ్‌ఫాదర్స్ లేరు ఇక్కడ. నేను టెక్నికల్‌గా ఔట్‌సైడర్‌ని. అందుకే ముందు ఆ డిస్కషన్ జరిగింది. కానీ, ఇది నా కల అని చెప్పగానే మా వాళ్లు సరేనన్నారు.”
నిర్మాతగా ఆల్రెడీ మరో 2 సినిమాలు ఫైనలైజ్ చేశానని ప్రకటించింది అవిక. ఓ సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయిందని, మరో సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని చెప్పుకొచ్చింది.