సీబీఐ విచారణ కోసం వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే విచారణకు ముందు ఆయన లోటస్ పాండ్ లో వైఎస్ విజయలక్ష్మీతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవుతానని చెప్పి వెళ్లిపోయారు.
ఇక వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయంలో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ లో టెన్షన్ నెలకొంది. ఇదే మొదటి సారి కావడం.. ప్రశ్నిస్తున్నది కూడా ముఖ్యమంత్రి జగన్ కు వరుసకు సోదరుడు అవినాష్ రెడ్డి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 24 నే విచారణకు రావాలని అంతకుముందు రోజు సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఐదు రోజుల తర్వాత విచారణకు రాగలనని ఎంపీ బదులిచ్చారు. దీంతో ఈ నెల 25న పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు.
ఈ కేసులో అవినాష్ ప్రమేయంపై సీబీఐ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇవాళ అవినాష్ ను అనుమానితుడిగానే ప్రశ్నించే అవకాశం ఉంది. అటు జగన్.. ఇటు భారతికి రెండు వైపుల నుంచి అవినాష్ రెడ్డి బంధువే. భారతి సొంత మేనమామ వైఎస్ భాస్కర్ రెడ్డి కొడుకే అవినాష్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం పులివెందులలో అవినాష్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి జిల్లా రాజకీయాలు చూసుకునేవారు. పులివెందులలో కూడా అవినాష్ కుటుంబానికి రాజకీయంగా పెద్ద పరపతి ఉండేది కాదు. అప్పట్లో కేవలం మున్సిపల్ రాజకీయాలకే పరిమితమయ్యేవారు. వైఎస్ మరణానంతరం జగన్ హయాంలో అవినాష్ రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది.
అయితే ఈ విచారణ నేపథ్యంలోనే సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఈ రోజు విచారణకు హాజరవుతున్నానని ఆయన లేఖ ద్వారా తెలిపారు. ”ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలి. తనతోపాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ విజ్ఞప్తులను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలి” అని సీబీఐని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు. ఇక ”వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైన దగ్గరనుంచి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోంది. తప్పు దోవ పట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారు. అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నా” అని ఆయన లేఖలో పేర్కొన్నారు.