జీవితంలో ప్రతీ మహిళ కోరుకునే కోరిక అమ్మ అని పిలిపించుకోవాలని. అలాంటి మహిళ తాను తల్లిగా మారి ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి ముఖంలో ఆనందానికి అవధులుండవు. అలాంటి ఓ మహిళ భర్త మరణించిన 11 నెలల తర్వాత మాతృత్వం పొందింది.
తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఓ జంటకు 2013లో వివాహం జరిగింది. అయితే.. పెళ్లయి ఏడేళ్లు దాటినా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో వీళ్లు వరంగల్ లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో 2020 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. అదే ఏడాది మార్చిలో అక్కడి వైద్యులు పరీక్షల నిమిత్తం భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి భద్రపరిచారు. ఈ నేపథ్యంలోనే 2021లో భర్త కరోనా సోకి మరణించాడు.
దీంతో పిల్లలు కావాలని తపించిన 32 ఏళ్ల మహిళ.. భర్త మరణంతో కృంగిపోయింది. దీంతో మరోసారి ఆమె వైద్యులను సంప్రదించింది. ఆస్పత్రిలో భద్రపరిచిన భర్త వీర్యం ద్వారా తల్లిని కావాలని భావిస్తున్నట్టు ఆమె వైద్యులకు తెలిపింది. ఈ అంశంపై న్యాయపరమైన చిక్కులు రాకుండా కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చుకుంది.
దీంతో గతంలో వైద్యులు భద్రపరిచిన వీర్యం ద్వారా మహిళకు 2021లో ఐవీఎఫ్ ద్వారా చికిత్స అందించారు. దీంతో ఆమె ఈ నెల 11న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. వైద్య రంగంలో ఇదొక అద్భుతం అంటున్నారు డాక్టర్లు.