ఏపీలో నారా లోకేష్ పాదయాత్ర మొదలైంది. కుప్పం నియోజకవర్గం నుంచి శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. యువగళం పేరుతో లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో పలు చర్చలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం సెటైర్లు వేశారు.
ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదంటూ నారాలోకేష్ పాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు! గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడంటూ మరో సెటైర్ వేశారు. చివరికి పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడంటూ వైఎస్ జగన్ తో లోకేష్ ను పోలుస్తూ మంత్రి అంబటి ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో అంబటి ట్వీట్ పై మండిపడుతున్న టీడీపీ నేతలు కౌంటర్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా స్పందించి ఘాటు కౌంటర్ ఇచ్చారు.
మంత్రి అంబటి లోకేష్ పాదయాత్రపై చేసిన ట్వీట్, అందులో జగన్ ను ఉదాహరణగా చెప్పడాన్ని తప్పుబడుతూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ కౌంటర్ ఇచ్చారు. ఇందులో అచ్చంగా జగన్ ను టార్గెట్ చేశారు. టెన్త్ క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగోడు, జనం సొమ్ము లక్షల కోట్లు దోచిన ఏ1 జగన్ పాదయాత్ర చేయొచ్చా అరగంట అంబటి? కోడికత్తిని తెచ్చి ఎన్నాళ్లు సానబట్టినా అది నత్తి పకోడీయే కానీ కత్తి కాదు. డబ్బు కోసం జనాల ప్రాణాలు తీసే బ్రాందీ అమ్మే జగన్ని అభినవ గాంధీ అని అంటూ అయ్యన్న రెచ్చిపోయారు.
అంతటితో ఆగకుండా.. ప్రచారం చేసుకోవడానికి సిగ్గులేదా? లోకేష్ పాదయాత్ర జగన్ సర్కారుకి పాడెయాత్ర. ఆ శవం ముందు నీదే డ్యాన్సు కాంట్రాక్ట్. కొత్త స్టెప్పులు నేర్చుకో అంటూ అంబటికి చురకలు అంటించారు. దీంతో ఈ ట్వీట్ వార్ ఇరుపార్టీల్లోనూ చర్చనీయాంశమవుతోంది.