భారతదేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల చిరకాల కల సాకారానికి తొలి అడుగు పడనుంది. రఘురాముడు నడయాడిన నేలగా భావించే అయోధ్యలో.. భవ్య రామ మందిర నిర్మాణానికి పునాది రాయి పడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేటి మధ్యాహ్నం ఈ అపూర్వ ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.45గంటల ఈ కార్యక్రమం జరుగుతుంది.
శంకుస్థాపన కార్యక్రమం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది. శంకుస్థాపనకు ముందు జరిగే క్రతువులన్నీ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. వేద పండితుల సమక్షంలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ తొలి ఇటుక వేస్తారు. కాగా శంకుస్థాపనను ఐదు వెండి ఇటుకలతో ప్రారంభించనున్నారు. అలాగే వందకుపైగా నదుల నుంచి తీసుకొచ్చిన పవిత్రజలాలు, మట్టిని వినియోగిస్తున్నారు. ఈ అపూర్వ ఘట్టానికి గుర్తుగా.. మోదీ పారిజాత మొక్కను నాటనున్నారు.