అయోధ్య రామాలయ నిర్మాణం పనులు చకా చకా సాగుతున్నాయి. తాజాగా రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేయించే పనిలో ఆలయ ట్రస్ట్ పడింది. విగ్రహం కోసం నమూనాలను పంపించాలంటూ సుప్ర సిద్ధ శిల్పులను కోరింది. వీటిలో ఒక నమూనాను ఎంపిక చేయనున్నారు.
ఆ నమూనా ప్రకారమే విగ్రహాన్ని తయారు చేయించి రామాలయంలో ప్రతిష్ఠిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. ట్రస్ట్ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం… దేశంలోని సుప్రసిద్ధమైన శిల్పులు మొదలు శ్రీ రాముని విగ్రహ నమూనాను తయారు చేసి ట్రస్టుకు పంపుతారు.
ఒడిశాకు చెందిన ప్రముఖ శిల్పి సుదర్శన్ సాహూ, వాసుదేవ్ కామత్, కర్ణాటకకు చెందిన కేవీ మనియా, పుణేకు చెందిన శస్త్రయజ్య దెవుల్కర్ లు శ్రీరాముని విగ్రహ నమూనాలను తయారు చేసి పంపించనున్నారు. 9 అంగుళాల నుంచి 12 అంగుళాల ఎత్తులో ఉండేలా ఈ నమూనాలను శిల్పులు పంపించనున్నారు.
ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మాట్లాడుతూ… రామ్ లల్లా విగ్రహ తయారికి ప్రత్యేక శిలలను ఎంపిక చేశామన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన శిలలు ఇందులో ఉన్నాయన్నారు. రామ్ లల్లా విగ్రహ నమూనాను ఖరారు చేసిన అనంతరం ఆ శిలలకు ట్రస్ట్ ఆమోదం తెలుపుతుందన్నారు.
విగ్రహంపై సూర్య కిరణాలు పడే విధంగా 8.5 నుంచి 9 అడుగుల ఎత్తులో రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేయిస్తామని వివరించారు. ఆలయ గర్భ గుడిని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు గాను దేశంలోని సుప్రసిద్ధ వాస్తు కళ, భవన నిర్మాణ రంగంలో నిపుణులను, అగ్ర శ్రేణి సంస్థలను ఈ ట్రస్ట్ ఆహ్వానించింది.
ప్రతి యేటా శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు శ్రీరాముని నుదుటిపై పడేలా గర్భ గుడిని నిర్మించాలని ట్రస్టు నిర్ణయించింది. దీని కోసం రూర్కీలోని సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ, పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ , సుప్రసిద్ధ దేవాలయ వాస్తు శిల్పులను ట్రస్టు నియమించింది.