ఆదర్శపురుషుడు, ఏకపత్నివ్రతుడు, తండ్రి మాట జవదాటని కుమారుడు, ఇలా శ్రీరాముడు గురించి చెప్పుకోవాలి అంటే ఎన్నో సుగుణాలు.. అందుకే ఆయన అందరికీ ఆదర్శం అంటారు. అంతేకాదు, జై శ్రీరామ్ అనే పదంలోనే ఏదో శక్తి ఉందని హిందువులు విశ్వసిస్తారు. అలాగే, శ్రీరామ నవమి రోజు స్వామివారిని పూజిస్తే కష్టాలన్నీ పోతాయని కూడా నమ్ముతారు.
ఈ క్రమంలోనే రాముడి పుట్టినరోజు, శ్రీ సీతారాముల పెళ్లి రోజు, రాముల వారి పట్టాభిషేకం అన్నీ ఒకే రోజైన చైత్రశుద్ధ నవమి రోజు హిందువులు ఎంతో ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. కాగా, ఎప్పటికప్పుడు విభిన్నమైన అంశాలపై సైకత శిల్పాల ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకునే సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా తన కళాత్మకతను ప్రదర్శిస్తూ అయోధ్య రాములోరి విగ్రహాన్ని రూపొందించారు.
శ్రీరామనవమి సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో సుదర్శన్ పట్నాయక్.. అయోధ్య రామమందిరం నేపథ్యంలో ఆరు అడుగుల ఎత్తైన శిల్పాన్ని రూపొందించి, ‘హ్యాపీ శ్రీరామ నవమి’ అని రాశారు. రామమందిరం ముందు ధనస్సు చేతపట్టి ఉన్నట్లు ఉన్న శ్రీరాముడి శిల్పం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. త్వరలోనే అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు సుదర్శన్ పట్నాయక్ ఈ సందర్భంగా తెలిపారు.
కాగా, సుదర్శన్ పట్నాయక్ ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా అంతర్జాతీయ సైకత శిల్ప ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని అనేక అవార్డులను పొందారు. జూన్ 2012 లో ఆయన అంతర్జాతీయ సైకత శిల్ప ఛాంపియన్‌షిప్‌లో మొదటి బహుమతిని గెలుచుకున్నారు. అతని సైకత శిల్పాలలో “బ్లాక్ తాజ్ మహల్” విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టింది.