కరోనా వైరస్ రక్కసి ఎవరినీ వదలటం లేదు. అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ వంటి యూరప్ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ ను మంచానికే పరిమితం చేసింది. అయితే… ప్రిన్స్ చార్లెస్ కరోనా నుండి బయటపడింది ఆయుర్వేదంతో అంటూ గోవా ఎంపీ, కేంద్ర ఆయుర్వేద మంత్రి శ్రీపాద్ నాయక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
బెంగుళూరుకు చెందిన డాక్టర్ మతాయి స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు మంత్రి ప్రకటించారు. ఆయుర్వేదం, హోమియోపతి మందుల ద్వారానే ప్రిన్స్ చార్లెస్ కోవిడ్-19 నుండి బయటపడ్డట్లు… ఆ మందులు తానే ఇచ్చినట్లు మతాయి తనకు చెప్పినట్లు మంత్రి విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
అయితే, ప్రిన్స్ చార్లెస్ తో పాటు ఆయన భార్య తన పేషెంట్లేనని… ఇటీవల తన బ్రిటన్ పర్యటనలో కూడా తాను వారిని కలిసినట్లు తెలిపారు. అయితే… తాను వారికి వైద్యం చేసిన ప్రశ్నపై మతాయి ఎలాంటి ప్రకటన చేయలేదు. తన పేషెంట్ గురించి చెప్పలేనని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి విష జ్వరాలతో పాటు కోవిడ్ పేషెంట్లకు తాను వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అయితే… దీనిపై ప్రిన్స్ చార్లెస్ ప్రతినిధి బృందం స్పందించింది. ఆయుర్వేద మందులు వాడిన వార్తల్లో నిజం లేదని, తమ దేశ జాతీయ వైద్య సంస్థ సలహాతోనే ప్రిన్స్ చార్లెస్ కోలుకున్నారని స్పష్టం చేశారు.