సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ తాను చేసిన పాపాలకు తానే మూల్యం చెల్లించుకున్నారని సినీ నటి, పొలిటీషియన్ కూడా అయిన జయప్రద మండిపడ్డారు. ఖాన్ ఆటకట్టయిందని, అధికార దాహంతో విర్రవీగితే తగిన శాస్తి తప్పదని కసిగా వ్యాఖ్యానించారు. యూపీ లోని మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె.. రాజకీయాల్లో వివిధ పార్టీల మధ్య విభేదాలు ఉంటాయని, కానీ అధికార మదం అన్నది ఉండరాదన్నారు. మహిళలు, బడుగువర్గాలను గౌరవించడమే మరిచిపోయి.. వారికి అన్యాయం చేస్తే ఏదో ఒక రకంగా శిక్ష తప్పదని రామ్ పూర్ మాజీ ఎంపీ కూడా అయిన జయప్రద అన్నారు.
మహిళలను ఎలా గౌరవించాలో ఆజం ఖాన్ కి, ఆయన కొడుకు అబ్దుల్లా ఆజంకి తెలియదని, ఈ తండ్రీ కొడుకులు తాము చేసిన పాపాలకు తామే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. గతంలో జయప్రదకు, ఆజం ఖాన్ కు మధ్య చాలా విభేదాలు వచ్చాయి. ఇద్దరూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రామ్ పూర్ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేసిన జయప్రదను ఉద్దేశించి ఆజం ఖాన్.. ‘ఖాకీ అండర్ వేర్’ అంటూ అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేశారు
. గత ఏడాది రామ్ పూర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిఎమ్మెల్యేగా గెలిచిన ఆజం ఖాన్.. ఇటీవల చిక్కుల్లో పడ్డారు. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు కోర్టు ఆయనకు మూడేళ్ళ జైలుశిక్ష విధించింది. శాసన సభ్యత్వానికి అనర్హునిగా ప్రకటించింది.
అలాగే స్వర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంపై కూడా అనర్హత వేటు పడింది. 2008 లో అక్రమంగా నిరసన ప్రదర్శన చేసినందుకు గాను కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. 2024 ఎన్నికల గురించి ప్రస్తావించిన జయప్రద.. ఆ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ భారీ మెజారిటీతో విజయం సాధించి తిరిగి ప్రధాని మోడీ నాయకత్వం కింద కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. రామ్ పూర్ నియోజకవర్గం కూడా బీజేపీ వశమవుతుందన్నారు.