యూపీలో సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజంలకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తు ప్రత్యేక కోర్టు నిన్న తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఫలితంగా అబ్దుల్లా ఆజం తన ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకోనున్నారు. 15 ఏళ్ళ నాటి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి వీరికి ఈ ‘శిక్షలు’ పడ్డాయి. 2008 లో మొరాదాబాద్ లో ట్రాఫిక్ ని నిలిపివేయడంతో పోలీసులు వీరి వాహనాన్ని అడ్డుకున్నారు.
ఆనాడు.. జనవరి 1 న రామ్ పూర్ జిల్లాలోని సీఆర్ఫీఎఫ్ క్యాంప్ పై ఉగ్రదాడి జరగగా, ఏడుగురు జవాన్లు, ఓ రిక్షా కార్మికుడు మృతి చెందారు. అయితే ఆ ఘటన సందర్భంలో ఆజం ఖాన్, అబ్దుల్లా ఆజం.. మొరాదాబాద్ లో ట్రాఫిక్ కి ఆటంకం కలిగించి హైడ్రామాకు తెర తీశారు. వీరి వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. నాటి ఈ కేసు విషయంలో మొరాదాబాద్ లోని స్పెషల్ కోర్టు ముందు వీరు సోమవారం హాజరు కాగా.. కోర్టు వీరికి రెండేళ్ల జైలు శిక్షతో బాటు మూడు వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది.
ఆ తరువాత వీరిద్దరూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారని, తగినంత ష్యురిటీపై కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసిందని మొరాదాబాద్ జిల్లా న్యాయవాది నితిన్ గుప్తా తెలిపారు. ఈ కేసులో మరో ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించిందని మోహన్ లాల్ విష్ణోయ్ అనే మరో లాయర్ వెల్లడించారు.
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ పై దాఖలైన రెండో కేసు ఇది. 2019 లోక్ సభ ఎన్నికల్లో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను గత ఏడాది అక్టోబరులో ఆయనకు మూడేళ్ళ జైలుశిక్ష పడింది. యూపీ పోలీసుల రికార్డుల ప్రకారం.. ఈయనపై 83 కేసులు, అబ్దుల్లా ఆజంపై 41 కేసులు నమోదై ఉన్నాయి. 2017 లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరిద్దరిపైనా ఇన్ని కేసులు పెట్టారు పోలీసులు. భూ కబ్జా, ఛీటింగ్. క్రిమినల్ ట్రెస్ పాస్ వంటి పలు కేసుల్లో వీరు నిందితులని పోలీసులు తెలిపారు.