ఇన్స్యూరెన్స్ సొమ్ము కోసం ఓ తండ్రి చేసిన మోసం బట్టబయలై .. అరెస్టయి ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. గుజరాత్ లో హర్షద్ బారోట్ అనే ఈ వ్యక్తికి అహమ్మదాబాద్ లోని గాంధీనగర్ సెషన్స్ కోర్టు రెండోసారి కూడా బెయిల్ నిరాకరించింది. బీమా డబ్బుల కోసం బారోట్.. తనకు కొడుకు పుట్టాడని, ఆ తరువాత చనిపోయాడని అంటూ బీమా కంపెనీని మోసగించాడు.
ఖేదా జిల్లాలో నివసించే ఇతగాడి కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఓ స్కూల్లో అడ్మినిస్ట్రేటర్ గా పని చేసే ఈయన తన మైనర్ కొడుకు విశ్వాస్ కోసం అంటూ 2013-14 లో సుమారు 53 లక్షలకు జీవిత కాల బీమా పాలసీలు తీసుకున్నాడు. 2017 జూన్ లో గుండెపోటుతో విశ్వాస్ మరణించాడని 2018 లో రిలయన్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి తెలిపి .. రెండు బీమా పాలసీల నుంచి రూ. 22 లక్షలు క్లెయిమ్ చేసుకున్నాడు.
కానీ బీమా కంపెనీలు ఆరా తీయగా ఇతనికి అసలు విశ్వాస్ అనే కొడుకు పుట్టనే లేదని తెలుసుకున్నాయి. 2019 జనవరిలో ఇతనిపై గాంధీనగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. ఇతనితో బాటు నలుగురు అధికారులపై కూడా పోలీసులు కేసు పెట్టారు. ఈ అధికారులు తమ కంపెనీ లో పని చేస్తున్నవారేనని, బారోట్ తో కుమ్మక్కయ్యారని రిలయన్స్ సంస్థ ఆరోపించింది. బారోట్ మోసం మరొకటి కూడా బయటపడింది. తాను పని చేస్తున్న స్కూల్లో ఐదో తరగతిలో తన కొడుకు అడ్మిషన్ పొందాడని బారోట్ నమ్మించగలిగాడు.
కానీ.. మరి నాలుగేళ్ల స్కూలింగ్ రికార్డులు మాత్రం లేవు. తన స్కూలు ప్రిన్సిపాల్ ని, మరికొందరిని భయపెట్టి మొత్తానికి కథ నడిపించాడు. 2003 లో తనకు కొడుకు పుట్టినట్టు, ఆ తరువాత మరణించినట్టు ఆరావళి జిల్లా అధికారుల నుంచి డెత్ సర్టిఫికెట్ కూడా సంపాదించాడు. అసలు బీమాకంపెనీలకు ఇతడి కొడుకు కనిపించనే లేదు. చివరకు బారోట్ ఛీటింగ్ బయటపడి పోలీసులు అరెస్టు చేశారు. పైగా బెయిల్ కోసం ఇతగాడు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.