మహిళలపట్ల తాను చేసిన వ్యాఖ్యలకు యోగా గురు బాబా రామ్ దేవ్ క్షమాపణలు చెప్పారు. దుస్తులు లేకున్నా మహిళలు అందంగా ఉంటారంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. తమ పట్ల అసభ్యంగా చేసిన ఈ కామెంట్స్ కి ఆయన క్షమాపణ చెప్పాలని మహిళంతా డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు రెండు రోజుల్లోగా బాబా రామ్ దేవ్ అపాలజీ చెప్పాలంటూ మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలీ చకంకర్ ఆయనకు నోటీసు జారీ చేశారు. ఈ స్టేట్మెంట్ కి రెండే రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. దీన్ని తీవ్రమైనదిగా తాము భావిస్తున్నామన్నారు.
దీంతో దిగొచ్చిన ఆయన క్షమాపణ చెప్పారు. దీనికి సంబంధించిన కాపీని రూపాలీ తన ట్వీట్ కి జోడించారు. ‘బాబా రామ్ దేవ్ అలియాస్ రామ్ కిషన్ యాదవ్ అపాలజీ చెప్పారని, మహిళా సాధికారత పట్ల తనకు ఎప్పటికీ గౌరవం ఉందని, సమాజంలో వారికి ఉన్నత స్థానం ఉందని పేర్కొన్నారని రూపాలీ వివరించారు.
‘నేను సదా బేటీ బచావో, బేటీపఢావో’ అన్న కేంద్ర నినాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చానని, అందువల్ల మహిళలను కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదని, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నా ఈ క్లిప్ ని మరో విధంగా ఆపాదించడం జరిగిందని రామ్ దేవ్ బాబా వివరించారు. ఇప్పటికైనా మహిళలెవరైనా బాధ పడి ఉంటే అందుకు చాలా విచారిస్తున్నా.. నా స్టేట్మెంట్ ఎవరినైనా గాయపరచి ఉన్న పక్షంలో బేషరతుగా క్షమాపణ చెబుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
థానేలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన బాబా రామ్ దేవ్.. మహిళలు చీరలు ధరించినా, సల్వార్ సూట్లు ధరించినా అందంగా ఉంటారని, నా లాగా ఏ దుస్తులూ ధరించకపోయినా బాగుంటారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత కూడా పాల్గొన్నారు. రామ్ దేవ్ వ్యాఖ్యలు మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానపరిచాయని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా డిమాండ్ చేశారు. దేశంలో కొన్ని చోట్ల మహిళలు ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు.