ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిషేధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీలోని సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయిన సందర్భంలో ఒకరిద్దరు ఏపీలో కొన్ని చానెళ్ల ప్రసారాల నిలిపివేత ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ విషయం పూర్వాపరాలు తెలుసుకున్న చంద్రబాబు.. ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
గుంటూరు: న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడం దారుణమని విస్మయం వ్యక్తం చేశారు. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కేస్తారా..? అంటూ కన్నెర్రజేశారు. బాధితుల బాధలు ప్రసారం చేసిన వార్తా చానళ్లను బంద్ చేసి మీరు ఏం సాధిస్తారు.? అని ప్రశ్నించారు. ‘న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడమా..?. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కేస్తారా..?. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేయాలని చూశారు. ఇప్పుడు న్యూస్ చానెళ్ల గొంతు నొక్కేస్తున్నారు. ఛానళ్ల ఎంపిక వినియోగదారుల ఇష్ట ప్రకారం వుంటుంది. ఏ ఛానల్ చూడాలో వారిష్టం. మీరు నిర్ణయిస్తారా? దీనికి ఒక నియంత్రణ వ్యవస్థ ట్రాయ్ ఉంది. నచ్చిన చానళ్ళు ఇవ్వాలని ముందుగా ఎంఎస్‌వోలను కోరాలి. 72 గంటల్లో ఎంఎస్‌వోలు స్పందించకపోతే ట్రాయ్‌కు ఫిర్యాదు చేయాలి’ చంద్రబాబు సూచించారు.