మూడేళ్లలో ఎన్నికలు రావడం ఖాయమని అంటున్నారు టీడీపీ నేత చంద్రబాబు. జమిలీ వస్తున్నాయని, ఆ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ది చెప్పడం ఖాయమని చెబుతున్నారు.
గుంటూరు: రాష్ట్రంలో రివర్స్ ఎన్నికలొస్తే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారన్నారు మాజీ సీఎం చంద్రబాబు. ‘రివర్స్ టెండర్ల వలన ఏమవుతుందో తెలియదని కానీ, ప్రజలు మాత్రం రివర్స్ ఎన్నికలొస్తే బాగుండునని అనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. రివర్స్ పాలన ఉన్నా రివర్స్ ఎన్నికలకు ఆస్కారం లేదని చమత్కరించారు. జమిలీ ఎన్నికలకు అవకాశం ఉందని, అదే నిజమైతే మూడేళ్ళలోనే ఎన్నికలొస్తాయని అభిప్రాయపడ్డారు. అప్పుడు వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. లీగల్ సెల్ సమావేశం తరువాత పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో కంటే ఇప్పుడు ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఊళ్లపై పడి దాడులు చేస్తూ రాక్షసులను మించి ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై 565 కేసులు అక్రమంగా నమోదు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంత అనాగరిక పరిస్థితులు లేవన్నారు. గత ప్రభుత్వ అవినీతి ఇంకా దొరకలేదా అంటూ అధికారులను, మంత్రులను కోప్పడే స్థితిలో సీఎం ఉన్నారని చంద్రబాబు విమర్శించారు.