మాజీ ఎంపీ శివప్రసాద్, మాజీ సీఎం చంద్రబాబు ఇద్దరూ బాల్య స్నేహితులు. చంద్రగిరి హైస్కూల్ లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. చిత్తూరు జిల్లా పుల్టిపల్లి నుంచి శివప్రసాద్, నారావారిపల్లి నుంచి చంద్రబాబు నాయుడు చంద్రగిరి హైస్కూల్ కు వెళ్లి 6 నుంచి 11 (ఎస్.ఎస్.ఎల్సీ.) వరకు కలిసి చదువుకున్నారు. 10వ తరగతిలో ‘పరువు కోసం ‘ నాటికలో చంద్రబాబు హీరో కాగా, శివప్రసాద్ కామెడీ, కం విలన్ వేషం వేశారు. రచయిత, డైరెక్టర్ గా శివప్రసాద్ నాటకాల్లో రాణించారు. అలా వారి స్నేహం సరదాగా సాగింది. చంద్రగిరి హైస్కూల్ లో దిగిన గ్రూప్ ఫోటోలో చంద్రబాబు పైన నిలుచున్న వరుసలో ఉండగా శివప్రసాద్ కూర్చున్న వారిలో (రౌండ్ చేసిన ) ఉన్నారు.
ఈ విషయం చంద్రబాబు గుర్తు చేసుకుంటూ ఇద్దరం స్కూల్ మేట్స్, నాటకాల మేట్స్, పొలిటికల్ మేట్స్ అని చెప్పారు. శివప్రసాద్‌ను తానే రాజకీయాల్లోకి ఆహ్వానించానని అన్నారు. శివప్రసాద్ టీడీపీకి చేసిన సేవలు మరువలేనివని, స్నేహాన్ని మరువలేనని చెప్పారు. కాలేజీ లెవల్లో చంద్రబాబు హీరో – శివప్రసాద్ హీరోయిన్ గానూ నాటకాల్లో అలరించారు.