విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్ల రూపాయలు ఆదా చేశామని చెబుతున్న ప్రభుత్వం ట్రూ అప్ కాకుండా ట్రూ డౌన్ చేసి విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు సీపీఎం నేత బాబూరావు. 2014 నుండి 19 వరకు వినియోగించుకున్న విద్యుత్ పై 3699 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో వసూళ్లకు విద్యుత్ నియంత్రణ మండలి గతంలో అనుమతి ఇచ్చిందన్న ఆయన.. న్యాయపరమైన వివాదాలు, ఇతర కారణాలతో ఆ ఆదేశాలను మండలి రద్దు చేసిందని చెప్పారు. ఆదేశాలు రద్దు చేసినందున ట్రూ అప్ ఛార్జీల వసూళ్లను నిలిపివేయాలని, ఇప్పటికే వసూలు చేసిన ఛార్జీలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని మండలి జరిపిన ఆన్లైన్ విచారణలో సీపీఎం కోరిందని వివరించారు. సీపీఎం, వివిధ సంస్థలు, ప్రజల ఒత్తిడి మేరకు నియంత్రణ మండలి.. వసూలు చేసిన ఛార్జీలను తిరిగి వినియోగదారులకు చెల్లించాలని ఆదేశించిందన్నారు బాబూరావు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు భారం మోపే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని.. భవిష్యత్తులో కూడా ఇలాంటివి చేయొద్దని.. ఒకవేళ చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Andhra Pradesh » ట్రూ అప్ కాదు.. డౌన్ చేయాలి