ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మన దేశంలోనూ జనవరి 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ప్రస్తుతం రెండో దశ పంపిణీ కొనసాగుతోంది. అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా అమెరికా సైంటిస్టులు అద్భుతమైన ఘనత సాధించారు. ఓ గర్భిణీకి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వగా ఆమె తాజాగా శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువులో కోవిడ్ యాంటీ బాడీలు ఉండడం విశేషం.
అమెరికాలోని సౌత్ ఫ్లోరిడాలో ఓ మహిళ 3 వారాల ముందు కోవిడ్ టీకా మొదటి డోసు తీసుకుంది. తాజాగా ఆమె ఓ శిశువుకు జన్మ ఇచ్చింది. ఈ క్రమంలో శిశువు జన్మించగానే ఆ శిశువుకు చెందిన బొడ్డు తాడు నుంచి సైంటిస్టులు రక్తాన్ని సేకరించారు. అనంతరం ఆ రక్తాన్ని పరీక్షించగా అందులో సార్స్-కోవ్-2 యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతమైన ఘట్టం అని సైంటిస్టులు తెలిపారు.
సాధారణంగా అనేక దేశాల్లో కోవిడ్ టీకాలను గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వడం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో వారు పాల్గొనలేదు. అందువల్ల వారికి టీకాలు ఇస్తే ఏవైనా దుష్ప్రభావాలు కలగవచ్చనే నేపథ్యంలో అనేక దేశాల్లో వారికి టీకాలను ఇవ్వడం లేదు. మన దేశంలోనూ గర్భిణీలు, పాలిచ్చే తల్లులతోపాటు చిన్నారులకు కూడా టీకాలను ఇవ్వట్లేదు. అయితే ప్రస్తుతం జరిగిన సంఘటన వల్ల గర్భిణీలు కూడా టీకాలను తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తారని సైంటిస్టులు తెలిపారు. అలాగే కోవిడ్ వచ్చి తగ్గిన గర్భిణీల నుంచి యాంటీ బాడీలు శిశువులకు అందుతాయని, అందువల్ల వారికి వ్యాక్సిన్లు అవసరం లేదని కూడా సైంటిస్టులు తెలిపారు.
అయితే ప్రస్తుతం కేవలం ఒక్క కేసులో మాత్రమే ఇలా యాంటీ బాడీలు కనిపించాయి. కనుక దీనిపై ఇంకా పరిశోధనలు చేయాలని సైంటిస్టులు తెలిపారు.