ఓవైపు ఆవర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించింది ప్రభుత్వం. అది చేశాం.. ఇది చేశాం.. ఇంకా చేయాల్సింది ఉంది.. అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోంది అంటూ సీఎం నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా గప్పాలు కొట్టుకున్నారు. కానీ.. ఇంకోవైపు సిరిసిల్లలో జరిగిన ఘటన వాస్తవానికి అద్దం పడుతోంది.
మంత్రి కేటీఆర్ ఇలాకా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగుచూసింది. డెలివరీ కోసం వచ్చిన ఓ గర్భిణీ బాత్రూంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఇది జరిగిందని బాధిత కుటుంబం చెబుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. వీర్నపెల్లి మండలానికి చెందిన లోకుర్తి నాగరాజు, మాధవి భార్యాభర్తులు. గర్భిణీ అయిన మాధవి.. జిల్లా ప్రధాన ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చింది. కుటుంబసభ్యులు ఎంతో జాగ్రత్తగా ఆమెను తీసుకొచ్చారు. కానీ.. వచ్చాక డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరని తెలిసింది.
మాధవికి నొప్పులు ఎక్కువవడంతో బాత్రూంకు తీసుకెళ్లారు. అక్కడ ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ.. శిశువు చనిపోయింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాత్రూంలో పుట్టిన బిడ్డ చనిపోయిందని కుటుంబసభ్యులు అంటున్నారు. వారి నిర్లక్ష్యం వల్ల పాప మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాద్యులైన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే ఈ ఘటన వెలుగుచూడడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు ప్రజలు.