ఐదు రూపాయల కాయిన్ చిన్నారి ఊపిరి ఆగిపోయేలా చేసింది. ప్రాణం తీసింది. ఫైవ్ రూపీస్ కాయిన్‌తో సరదాగా ఆడుకుంటున్న క్రమంలో నాణేన్ని నోట్లో పెట్టుకుంది. అది పొరపాటున గొంతులోకి జారిపోవడంతో చిన్నారి విలవిలలాడింది. ఊపిరాడక తల్లడిల్లింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భూదాన్ పోచంపల్లిలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు సరిత- మహేష్ దంపతుల కుమార్తె చైత్ర(4) ఎల్‌కేజీ చదువుతోంది. వారం రోజుల క్రితం ఆమె ఐదు రూపాయల నాణెం మింగింది. తీవ్రంగా ఏడుస్తుండటంతో.. చైత్రను తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పాపకు చికిత్స చేసి నాణెం తొలగించారు. దీంతో కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, చిన్నారి సోమవారం మరోసారి అస్వస్థతకు గురైంది. శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు చైత్రను మళ్లీ అదే ఆసుపత్రికి పయనమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే చైత్ర ప్రాణాలు కోల్పోయింది.
ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి అకస్మాత్తుగా తనువు చాలించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో భూదాన్ పోచంపల్లిలో విషాదం అలుముకుంది.