భూమ్మీద నూకలుంటే ప్రమాదం ఎంత పెద్దదైనా సురక్షితంగా బయట పడతారు. కేరళ ఇడుక్కి రాజమల అటవీ ప్రాంతంలో వేగంగా వెళుతున్న జీప్ నుంచి జారి పడిన చిన్నారి సేఫ్‌గా బయట పడటం ఓ అద్భుతం.
చెన్నయ్: ఓ కుటుంబం తమిళనాడు పళని టెంపుల్‌కు వెళ్లి దైవదర్శనం చేసుకుని జీపులో వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తల్లి సత్యభామ ఒడిలో ఉన్న ఏడాది బేబీ రోహిత ఫారెస్ట్ చెక్‌పోస్ట్ సమీపంలో జారి పడిపోయింది. ఆదమరచి కునుకుతీస్తున్న తల్లి 40 కి.మీ. దూరంలోని ముల్లారైకుడిలోని తమ నివాసానికి వెళ్ళే వరకు చూసుకోలేదు. బేబీ కనిపించలేదని వెళ్లతోవల్ పోలీసు స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చింది. తర్వాత ఆశ్చర్యం కలిగించే అంశాలు తెలిశాయి.
బేబీ రోహిత ఏనుగులు, ఇతర క్రూర మృగాలు వుండే ప్రాంతంలో జీపులోంచి రోడ్డు పక్కన పడగానే ఏడుపు లంఘించుకుని పాకుతూ రోడ్డు దాటి ఫుట్ ఫాత్ పైకి చేరింది. నుదుటిపై గాయమైనా ఏమాత్రం భయపడకుండా అటవీ ప్రాంతంలో అలానే ఉండిపోయింది. బేబీ వెలుతురు వున్న ప్రాంతం వైపు రావడంతో సురక్షితంగా ఉంది. మరోవైపు వెళితే గుంతలో పడిపోయి క్రూర మృగాల బారిన పడేది.
తల్లి రిపోర్ట్ అందగానే పోలీసులు అలర్ట్ అయి ఫారెస్ట్ అధికారులకు సమాచారం పంపారు. మున్నార్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్.లక్ష్మి వెంటనే స్పాట్‌కు వెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో చెక్‌పోస్ట్ సిబ్బందిని సంప్రదించి వెతికారు. సీసీ ఫుటేజ్ ద్వారా జీపు నుంచి బేబీ పడిపోయిన విజువల్స్ పరిశీలించారు. నుదురు, చేతులపై గాయాలతో ఏడుస్తున్న బేబీని గుర్తించి మున్నార్ టాటా టీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు రాత్రి 1.30 గంటలకు బేబీని తల్లిదండ్రులకు అప్పగించారు.