కరోనా వల్ల హీరోల ప్లానింగ్స్ అన్నీ తలకిందులయ్యాయి. ఏడాదికి ఒక సినిమా చేసే హీరోలు రెండేళ్లు టైమ్ తీసుకుంటే, ఏడాదికి 2-3 సినిమాలు చేద్దామనుకున్న హీరోలు.. ఒకేసారి రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయాల్సిన పరిస్థితికి వచ్చారు. నిఖిల్ ఇప్పుడు రెండో సిచ్యుయేషన్ లో ఉన్నాడు.
కార్తికేయ-2, 18-పేజెస్ సినిమాల్ని మినిమం గ్యాప్స్ లో స్టార్ట్ చేశాడు నిఖిల్. రెండు సినిమాల మధ్య కనీసం 5 నెలలు గ్యాప్ ఉండేలా రిలీజ్ చేయాలనేది అతడి ప్లాన్. కానీ లాక్ డౌన్ వల్ల అతడి ప్లాన్ మిస్సయింది. ఇప్పుడీ రెండు సినిమాలు నెల రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.
చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ చేస్తున్న సినిమా కార్తికేయ-2. ఈ సినిమాను జులై 22న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇక జీఏ2 బ్యానర్ పై సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ చేస్తున్న సినిమా 18-పేజెస్. ఈ సినిమా కూడా దాదాపు రెడీ అయిపోయింది. కార్తికేయ-2కు ముందు లేదా తర్వాత విడుదల చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం పీపుల్స్ మీడియా నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నారు బన్నీ వాసు. కుదిరితే జూన్ లో 18-పేజెస్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. భారీ గ్రాఫిక్స్ తో కూడిన కార్తికేయ-2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో జాప్యం వల్ల లేట్ అయితే.. 18-పేజెస్ ను జులైలో విడుదల చేయాలనేది ప్లాన్.
మొత్తమ్మీద ఈ రెండు సినిమాల విడుదల తేదీలు కాస్త అటుఇటు అయినా నెల రోజుల గ్యాప్ లో మాత్రం రావడం ఖాయం. అర్జున్ సురవరం తర్వాత నిఖిల్ కెరీర్ లో లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఆ సినిమా సక్సెస్ అయినా దాన్ని క్యాష్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడీ రెండు సినిమాలతో హిట్ కొట్టి, హ్యాట్రిక్ హీరో అనిపించుకోవాలని తహతహలాడుతున్నాడు ఈ హీరో.