బాలీవుడ్ అంటే ఒకప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కి బాద్షా. కానీ.. ఇప్పుడు ఆ బాద్షాకే ఎర్త్ పెడుతోంది టాలివుడ్. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ తో.. తెలుగు హీరోలు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. మన అడ్డా కాకపొయినా కోట్లు కొల్లగొడుతున్నారు. మనోళ్ల స్పీడుకు నార్త్ లో స్టార్ హీరోలు సైతం భయపడే రోజులొచ్చాయనేది సినీ ప్రేక్షకుల మాట.
కొన్ని రోజులు క్రితం వరకు పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో కూడా తెలియని వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ.. ఈ ఏడాది నువ్వానేనా అన్నట్టు పాన్ ఇండియా సినిమాలు రావడంతో ప్రేక్షకుల్లో జోష్ వచ్చింది. దక్షిణాదిలోనూ పాన్ ఇండియా చిత్రాల సత్తా ఏంటో పుష్ప తో మరోసారి చాటి చెప్పినట్టైంది టాలీవుడ్.
బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు సాధించిన విజయాలే ఈ ట్రెండ్ కి స్ఫూర్తిగా నిలిచాయనడంలో సందేహం లేదు. ఇటు మలయాళం నుంచి అటు హిందీ వరకు భాషలన్నిటినీ ఏకం చేశాయి. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్, కె.జి.ఎఫ్-2, రాధేశ్యామ్.. ఈ మూడు నాలుగేళ్లుగా ప్రేక్షకుల్ని ఊరిస్తున్నవే. బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. అది ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్ర నిర్మాణ వ్యయం రూ.500 కోట్లు చేరి ఉంటుందనేది పరిశ్రమ వర్గాలు మాట.
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి పాన్ ఇండియా మార్కెట్ లో జెండా ఎగరేసిన మరో చిత్రం కె.జి.ఎఫ్. ఆ చిత్రానికి కొనసాగింపుగా కె.జి.ఎఫ్ ఛాప్టర్2 తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ.100 కోట్ల పైమాటే.