“నేను విన్నాను..నేను ఉన్నాను.” సర్కారువారి పాట సినిమాలో సూపర్ హిట్టయిన డైలాగ్ ఇది. వైఎస్ఆర్ ట్రేడ్ మార్క్ డైలాగ్ ను ఇలా సినిమాలో పెట్టుకున్నారు. రాజకీయంగా చాలా పాపులరైన ఈ డైలాగ్ ను సినిమాలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు దర్శకుడు పరశురామ్.
“నాకు రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానం. ఆయన్ని చూస్తే ఒక హీరో ఫీలింగ్. చాల గొప్ప మాటని సింపుల్ గా చెప్పేశారు. సర్కారు వారి పాట లో కూడా అలాంటి ఒక సందర్భం వచ్చింది. మహేష్ గారు ఆ డైలాగు చెప్పారు. నేను కథ చెప్పినపుడే ఈ డైలాగ్ గురించి చెప్పాను. మహేష్ గారు చాలా ఎంజాయ్ చేశారు. ఆ సీన్ వరకు వచ్చి వెళ్ళిపోయే డైలాగ్ అది. ఆ సీన్ అద్భుతంగా వుంటుంది.”
ఇక హీరోయిన్ కీర్తిసురేష్ పై కూడా స్పందించాడు పరశురామ్. చాలామంది స్టార్ హీరోయిన్లు ఉఁడగా, కీర్తిని తీసుకోవడం వెనక చాలా కథ ఉందంటున్నాడు. సినిమా చూసిన తర్వాత అంతా కీర్తిసురేష్ పాత్ర గురించి మాట్లాడుకుంటారని చెబుతున్నాడు ఈ దర్శకుడు.
“లాక్ డౌన్ కి ముందే ఈ కథ ఫైనల్ అయింది. అప్పుడు హీరోయిన్ పాత్రకి కీర్తి సురేష్ తప్ప మరో ఆలోచన రాలేదు. సినిమా చూసిన తర్వాత హీరోయిన్ గా కీర్తిని ఎందుకు పెట్టుకున్నామో అందరికీ అర్ధమౌతుంది. తన లుక్స్ అద్భుతంగా వుంటాయి. మహేష్ బాబు గారిని చాలా కొత్తగా అద్భుతంగా చూపించారని ట్రైలర్ చూసి ఎలా మాట్లాడుకుంటున్నారో సినిమా చూసిన తర్వాత్ కీర్తి సురేష్ పాత్రకు కూడా అంత మంచి పేరొస్తుంది.”
మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సర్కారువారి పాట సినిమా వచ్చే వారం థియేటర్లలోకి వస్తోంది. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.