కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జనాలను తీవ్రమైన భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే ఎన్నో లక్షల మంది కరోనా వల్ల చనిపోయారు. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇది చాలదన్నట్లు అమెరికాలో మరో మహమ్మారి వ్యాప్తి మొదలైంది. కానీ అది వైరస్ వల్ల కాదు.. బాక్టీరియా వల్ల వస్తోంది. దీని వల్ల వందల సంఖ్యలో వ్యక్తులు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. పలువురు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.
అమెరికాలోని 30కి పైగా రాష్ట్రాల్లో సుమారుగా 400 మంది ఎరుపు ఉల్లిపాయల వల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారని అక్కడి అధికారులు తెలిపారు. సాల్మొనెల్లా అనబడే బాక్టీరియా సోకిన ఉల్లిపాయలను తినడం వల్ల వారు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇందుకు కాలిఫోర్నియాకు చెందిన థామ్సన్ ఇంటర్నేషనల్ ఐఎన్‌సీ అనే కంపెనీ కారణమని గుర్తించారు. వారే ఆ ఉల్లిపాయలను అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేశారు. ఈ క్రమంలోనే ఆ ఉల్లిపాయలను తిన్నవారు సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు.
సాధారణంగా మన శరీరాల్లో సాల్మొనెల్లా బాక్టీరియా ఎంతో కొంత ఉంటుంది. కాకపోతే అది మనల్ని ఏమీ చేయలేదు. కానీ సాల్మొనెల్లా ఉన్న ఇతర పదార్థాలు, పానీయాలను తీసుకుంటే శరీరంలో ఆ బాక్టీరియా శాతం పెరుగుతుంది. దీంతో టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అమెరికాలోనూ ఈ బాక్టీరియా వల్ల అనేక మంది ఇన్‌ఫెక్షన్‌కు గురవగా.. హాస్పిటళ్లలో 60 మందికి పైగా చికిత్స పొందుతున్నారు.
అయితే ఈ ఇన్ఫెక్షన్ జూన్ మధ్య నుంచి జూలై మధ్య నెలల్లో వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు కంపెనీ తాము సరఫరా చేసిన ఎరుపు ఉల్లిపాయలతోపాటు ఇతర రంగు ఉల్లిపాయలను కూడా వెనక్కి తీసుకుంటోంది. ఇక దీనిపై అమెరికా పబ్లిక్ హెల్త్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కెనడా ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ విషయంపై విచారణ చేపట్టింది. అయితే ఒకేసారి ఇలా పెద్ద ఎత్తున వ్యక్తులు సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్‌కు గురవడం మాత్రం అందరినీ కలవరపెడుతోంది.