– ఒక్కొక్కరుగా జారుకుంటున్న నేతలు
– వరుసగా మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల గుడ్ బై
– అదే బాటలో బడంగ్ పేట్ మేయర్
బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో ఆపార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో ఉండగా.. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహరెడ్డి పెద్ద షాకిచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపించారు.
కొన్ని అనివార్య, వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీకి రిజైన్ చేసిన్నట్లు లేఖలో పేర్కొన్నారు పారిజాత. అలాగే.. పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. బడంగ్ పేట అభివృద్ధి కోసం పార్టీ ఏది తలపెట్టినా శక్తివంచన లేకుండా కష్టపడ్డానని తెలిపారు.
ఎంత కష్టపడినా తనను గుర్తించడం లేదని అసంతృప్తిలో మేయర్ ఉన్నారు. ఆ కారణంగానే రాజీనామా చేసినట్లు సమాచారం. ఎంతకాలం ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండాలని తీవ్ర అసహనంతో ఉన్న ఆమె.. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈమె రెండేళ్ల పాటు టీఆర్ఎస్ లో కొనసాగారు.
మరోవైపు పారిజాత నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈమధ్య టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వారి బాటలోనే పారిజాత నడుస్తున్నట్లు సమాచారం.