ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు బద్రీనాథ్ కు వెళ్లే దారిలో పడిపోయాయి. దాంతో అధికారులు అప్రమత్తమై రోడ్డు మార్గాన్ని మూసివేశారు. వెంటనే పునరుద్దరణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
బద్రీనాథ్ – కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ప్రకారం.. ఈ ఏడాది 7.60లక్షల మంది పర్యాటకులు బద్రీనాథ్‌ను సందర్శించారు. మే 8న బద్రీనాథ్ యాత్ర ప్రారంభమైంది. రోడ్డు మూతపడడంతో యాత్రకు ఆటంకం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో భక్తులు చిక్కుకుపోయినట్లుగా అధికారులు తెలిపారు.
ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి బద్రీనాథ్‌ను సందర్శించి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. ప్రాజెక్టుల్లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, అరైవల్ ప్లాజా నిర్మాణం, దేవాలయం సమీపంలోని సరస్సుల సుందరీకరణ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా లూప్ రోడ్, బైపాస్ నిర్మాణాలున్నాయి.
పనుల నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.