ఎక్కడైనా తిండి పోటీలు జరగడం మామూలే. వాటిలో పొట్ట పగిలే అన్ని ఐటమ్స్ పెట్టి పోటీలు నిర్వహిస్తుంటారు నిర్వాహకులు. మామూలుగా అయితే ఎక్కువగా కారం ఉన్న ఆహార పదార్థాలను కానీ, బాగా తీపిగా ఉన్న పదార్థాలను కానీ తినడానికి పెడుతుంటారు. చాలా తక్కువ మంది ఈ పోటీలలో గెలుస్తుంటారు కూడా.
కానీ ఇక్కడ నిర్వహించే పోటీలో కేవలం ఒక సమోసా తింటే చాలు.. అక్షరాల రూ.51 వేలు గెలుచుకోవచ్చు. ఏంటీ ఒక్క సమోసా తింటే 51 వేలిస్తారా.. అది ఎంతలో పని కళ్లు మూసుకుని తెరిచేలోపు తినేయోచ్చు అనుకుంటే పప్పులో కాదు సమోసాలో కాలేసినట్లే… ఎందుకంటే అది బాహుబలి సమోసా.
ఏకంగా ఎనిమిది కిలోల బరువుతో ఈ సమోసాని తయారు చేశారు. దాన్ని అరగంటలో తినేస్తే.. రూ.51 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన కౌశల్ స్వీట్ షాప్ ఈ ఆఫర్ పెట్టింది.
మీరట్ కు చెందిన శుభమ్ అనే యువతి తమ స్వీట్ షాప్ కు బాగా ప్రచారం వచ్చేందుకు ఏం చేయాలని ఆలోచించింది. ఏదైనా సరికొత్తగా చేయాలన్న ఉద్దేశంతో పేద్ద సమోసాను తయారు చేసింది. ఆలూ, వెన్న, బఠానీ, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి 8 కిలోల సమోసాను రూపొందించి.. ఆఫర్ పెట్టింది.
ఆ సమోసాను అర గంటలో తిన్నవాళ్లకు రూ.51 వేలు బహుమతి ఇస్తానని ప్రకటించింది. ఆ నోటా ఈ నోటా దీనిపై బాగా ప్రచారం జరిగింది. కొందరు ఈ ‘బాహుబలి’ సమోసాను తినేందుకు ప్రయత్నించినా.. అర గంటలో పూర్తి చేయలేకపోయారు. ఇది మెల్లగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అనుకున్నదానికంటే ఎక్కువ ప్రచారం వచ్చింది.
ఈ సమోసా తినాలని మీరు కూడా అనుకుంటున్నారా.. అయితే మీరట్‌కు బయల్దేరండి మరి.