సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. కొన్ని షరతులతో ఓకే చెప్పింది.
2 సూరిటీలతో 3 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. అలాగే.. ప్రతీ సోమవారం సిట్ పోలీసుల ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. నంద్ కుమార్ తరఫున సీనియర్ లాయర్ ఎల్ రవిచందర్ వాదనలు వినిపించారు.
తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీ ఈమధ్యే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం కూడా విచారణ జరిపింది హైకోర్టు. వారికి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. సుప్రీం తీర్పులను నిందితుల తరఫు న్యాయవాది రామారావు ప్రస్థావించారు. వాదనలు విన్న తర్వాత విచారణను గురువారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే విచారణ జరిపిన న్యాయస్థానం ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో తుషార్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల క్రితం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం.. అరెస్ట్ చేయొద్దని సిట్ ను ఆదేశించింది.