ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా 18 మందికి నాంపల్లి కోర్డు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వారంతా సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ.. కొద్ది రోజుల క్రితం ఎన్ఎస్‌యూఐ విద్యార్థి నేతలు వీసీ ఛాంబర్ దగ్గర నిరసన చేపట్టారు. వీసీకి పింక్ కలర్ చీర, గాజులు, పూలు ఇచ్చేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా 18 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మహిళా కానిస్టేబుల్ పట్ల వీరు అసభ్యంగా ప్రవర్తించారంటూ.. పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో బల్మూరి వెంకట్ సహా 18 మంది విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ఆ 18 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇక రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ అరెస్ట్ అయిన వారితో ములాఖత్ అయ్యేందుకు పార్టీ నేతలు జైలు సూపరింటెండెంట్ ను కోరగా జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే రాహుల్ వారిని కలిసి అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.