చీటింగ్ ఆరోపణలతో ఇటీవల అరెస్టు అయిన శిల్ప చౌదరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు సెక్షన్ల కింద అరెస్ట్ అయిన శిల్పాకు ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆమె శుక్రవారం విడుదలైయ్యే అవకాశం ఉంది. శిల్ప తనని తను సినీ నిర్మాతగా, తన భర్తను రియల్టర్ గా పరిచయం చేసుకుంటూ చాలా మంది దగ్గర డబ్బులు కాజేసిన ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
సినిమాల్లో, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే మంచి రాబడి ఉంటుందని నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేసింది. వాళ్లను నమ్మించడానికి సినిమా స్టార్లతో తీసుకున్న ఫోటోలు చూపిస్తూ ఖరీదైన గిఫ్ట్ లను ఇస్తూ పెట్టుబడులు పెట్టాలని నమ్మబలికింది. దీంతో చాలామంది శిల్ప మాయలో పడి డబ్బు పోగొట్టుకున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా.. లాభాలు పక్కనపెడితే పెట్టుబడి కూడా రాకపోవడంతో పలువురు పోలీసులను ఆశ్రయించారు. దీంతో శిల్పా లీలలు బయట పడ్డాయి. ఈ కేసుల పై ఇటీవల ఆమె అరెస్టయింది.