బైరి నరేష్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నరేష్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఉద్దేశ పూర్వకంగానే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టు విచారణ సమయంలో అంగీకరించినట్టు తెలుస్తోంది. కావాలనే ఈ కార్యక్రమానికి నరేష్‌ను ఆహ్వానించినట్టు కార్యక్రమ నిర్వాహకుడు హనుమంతు అంగీకరించాడు.
గత నెల 19న కొడంగల్‌లో నిర్వహించిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో బైరి నరేష్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు, అయ్యప్ప మాలధారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బైరి నరేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ అయ్యప్ప మాలధారులు, హిందూ సంఘాలు ఆందోళకు దిగాయి. నరేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అయ్యప్ప మాలధారులు, హిందూ సంఘాల నేతలు ధర్నాలు, రాస్తా రోకోలు చేశారు. అదే సమయంలో కోస్గిలో నరేష్ అనుచరుడిపై అయ్యప్ప స్వాములు దాడి చేశారు.
మరోవైపు నరేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ అతని సోదరుడు అగ్నితేజ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. దీంతో మరోసారి వివాదం రేగింది. ఈ నేపథ్యంలో అగ్ని తేజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.