భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. బాధితులకు న్యాయం జరిగే వరకు నిష్క్రమించేది లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ ఈ ఘటనను నిరసిస్తూ.. గాంధీ భవన్ ముందు ధర్నాకు దిగారు. వనమా కుమారుడుని నిర్భయ, హత్య నేరం చట్టాల కింద కేసు నమోదు చేయాలని ప్లకార్డులు పట్టుకొని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకు నేరాలు చెయ్యడానికి కేసీఆర్ లైసెన్స్ ఇచ్చారా అని ప్రశ్నించారు.
తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి పనమా రాఘవే కారణం అని బాధితుడు పూసగుచ్చినట్టు వీడియో ద్వారా చెప్పినా.. పోలీసులు ఎందుకు చర్యలకు వెనకాడుతున్నారని బక్క జడ్సన్ ప్రశ్నించారు. సొంత భార్య గురించి ఏ భర్త వినకూడని మాటలు బాధితుడు రామకృష్ణ వినాల్సి వచ్చిందని ఆయన ఆవేదన చెందారు. రాఘవేంద్ర కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయని ఈ వీడియో ద్వారా తెలుస్తోందని జడ్సన్ అన్నారు.
Advertisements
ఇలాంటి దుర్మార్గులు రాజకీయంగా ఎదిగితే ప్రమాదమని, ఆయనను ఎదగనివ్వొద్దని రామకృష్ణ కోరాడని చెప్పారు. తాను ఒక్కడిని ఆత్మహత్య చేసుకుంటే తన భార్య, పిల్లలను రాఘవేంద్ర వదిలిపెట్టడని కుటుంబం మొత్తం చనిపోతున్నామని రామకృష్ణ వీడియోలో వివరించిన విషయాన్ని జడ్సన్ తెలిపారు.