తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ. శాంత కుమారిపై డీఓపీటీ, కేంద్రానికి కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారిని కాపాడేందుకు ప్రయత్నించినందుకు, మియాపూర్ భూకుంభ కోణంలో ఆమెపై ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు 2020లో నేషనల్ హెల్త్ మిషన్ చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో రూ. 20.40 కోట్ల నిధులను దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు.
అప్పుడు దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విచారణ జరిపి శ్రీనివాస్ రావుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసులు చేశారన్నారు. కానీ ఆ తర్వాత శ్రీనివాస్ రావుపై కేసు విత్ డ్రా చేయాలంటూ అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పారు.
మియాపూర్ భూముల కుంభకోణంలో రిజిస్ట్రేషన్లు కూడా ఆమె కనుసన్నల్లోనే నడిచాయని ఆరోపించారు. ఆమె గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ పీఎస్ ప్రసాద్‌కు బంధువని వార్తలు వస్తున్నాయన్నారు. ఆ భూమిని క్లియర్ చేసేందుకు, ల్యాండ్ కార్టెల్‌లకు సహాయం చేసేందుకు ఆమెను ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా నియమించారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఆరోపణల నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.