కేసీఆర్ కుటుంబంపై వరుసగా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో కేటీఆర్, కవితపై కంప్లయింట్స్ అందగా.. తాజాగా ఎంపీ సంతోష్ పై కూడా అందింది. కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ ఈ కంప్లయింట్ చేశారు. అటు ఢిల్లీలోని అధికారులకు ఇటు హైదరాబాద్ లోని ఆఫీసర్లను ఆయన కలిశారు. హరితహారం పేరుతో జరుగుతున్న స్కాంపై వివరించారు.
హరితహారం కార్యక్రమం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు జడ్సన్. ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసే ఈ గేమ్ లో సూత్రధారి జోగినపల్లి సంతోషేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నరేగాకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా హరితహారం కార్యక్రమానికి దారి మళ్లించిందని వివరించారు. అలాగే కాంపా నిధులను కూడా దుర్వినియోగం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాదాపు రూ.401 కోట్ల రూపాయలను డైవర్ట్ చేశారని.. 2014 నుంచి 2018 వరకు కాజేశారని అన్నారు జడ్సన్. హరితహారం పేరుతో గ్రామాల్లో భూములు గుంజుకున్నారని.. పేదోళ్లకు అన్యాయం చేశారని.. అందినకాడికి దోచేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మత్తు పదార్థాల కేసు ఏమైందని ప్రశ్నించారు. ఆ కేసులో సినీ యాక్టర్స్ ను తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
సినీ యాక్టర్స్ తో గ్రీన్ ఛాలెంజ్ అంటూ హడావుడి చేయడం వెనుక చాలా కథ ఉందన్నారు జడ్సన్. సంతోష్ రావు డబ్బులు దారి మళ్లించారని.. ఈడీ అధికారులకు అంతా చెప్పానన్నారు. వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.