ఎఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అర్ధరాత్రి నుంచి ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుడా పోలీసులు చుట్టుముట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు జడ్సన్. ఈ నేపథ్యంలోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు.
12 వందల మంది అమరుల త్యాగాలను గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. ఆమె నమ్మకాన్ని వమ్ము చేసి కాంగ్రెస్ నుండి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లారని అన్నారు జడ్సన్. వారిని అసెంబ్లీ గేట్ దగ్గర అడ్డుకుంటామని ఆదివారం పిలుపునిచ్చారు. కేసీఆర్ అప్రజాస్వామ్యంగా వారిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు.
వెంటనే 12 మంది ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు జడ్సన్. కార్యకర్తలు తమ భుజాలపై వేసుకుని కాంగ్రెస్ ను గెలిపిస్తే వారి కష్టాన్ని కాసులకు అమ్ముకున్నారా? అని ప్రశ్నించారు. సీఎల్పీ వారిని బర్తరఫ్ చేయించడంలో ఎందుకు విఫలం అయిందో అర్ధం కాలేదన్నారు.
12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారా? లేకుంటే కేసీఆర్ వాళ్లను బెదిరించి లాక్కున్నారా? అనేది కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియాలన్నారు జడ్సన్. ఈ క్రమంలోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ గృహనిర్బంధాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఖండించారు.