ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ప్లేయర్స్ సిద్ధమవుతుండగా.. క్రికెట్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగు అభిమానులకు ఫుల్ కిక్కేంచేందుకు ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ ‘స్టార్ స్పోర్ట్స్’ స్టార్ హీరోను రంగంలోకి దించుతోంది.
సినీ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ‘నందమూరి నటసింహం’ బాలకృష్ణ.. ఇక క్రికెట్ అభిమానులను కూడా ఖుషీ చేసేందుకు సిద్ధమయ్యారు. బాలయ్య బాబు కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నారు. ఐపీఎల్ 2023 ఓపెనింగ్ రోజు (మార్చి 31న) బాలయ్య బాబు కామెంటరీ ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ తెలుగు వెల్లడించింది.
దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో బాలకృష్ణ ఎలా కామెంటరీ చేస్తారో చూసేందుకు తెలుగు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హీరోగా నందమూరి బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయితుందటే.. ఫ్యాన్స్ గోలగోల చేస్తారు.
థియేటర్స్ మొత్తం విజిల్స్, అరుపులతో మోగిపోతుంది. బాలయ్య కూడా ఆ రేంజ్లోనే అభిమానులను ఖుషీ చేస్తాడు. బాలయ్య బాబు వెండి తెరపైనే కాకుండా.. ఇటీవల బుల్లితెరపై కూడా పలు టాక్ షోలకు హోస్టుగా చేస్తూ దూసుకెళుతున్నారు. తాజాగా మరో కొత్త అవతారం కూడా ఎత్తబోతున్నారు. క్రికెట్ అభిమానులను కూడా ఖుషీ చేసేందుకు సిద్ధమయ్యారు.