నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరంలో మరో నటరత్నం దూసుకొస్తోందా? బాలయ్య సినీ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా? ఇదే ఏపీలో ఫాన్స్ మధ్య పెద్ద డిస్కషన్ టాపిక్. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా నందమూరి ఫాన్స్ ఒకటే హంగామా చేస్తున్నారు. కొన్ని కాలేజీల్లో భారీ సెలబ్రేషన్స్ చేశారు. మోక్షజ్ఞ త్వరలో మూవీల్లోకి వస్తాడని, బాలయ్యబాబు అభిమానుల్ని మురిపిస్తాడని పెద్ద చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇదే టాక్.. ఇదే టాపిక్.
మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తే ఆ డెబ్యు మూవీ డైరెక్టర్ ఎవరనేది అప్పుడే చర్చనీయాంశం చేసేశారు. వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్, ఇలా ఎన్నో పేర్లు లిస్టులో చేరుతున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళితో ఆమధ్య ఇదే టాపిక్ మాట్లాడినట్టు మరో కథనం. ఈ క్రేజీ చర్చల మధ్య బెజవాడ, ఏలూరు, రాజమహేంద్రి, విశాఖ, గుంటూరు నగరాలలో బాలయ్య ఫాన్స్ మోక్షజ్ఞ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
నందమూరి వారసుడిగా మూడోతరంలో ఇప్పటికే ముగ్గురు వారసులు వున్నారు. తారక్, కల్యాణ్‌రామ్, తారకరత్న ఇప్పటికే ఫీల్డులో వున్నారు. తారక్ స్టార్ హీరోగా నిలబడిపోగా, కల్యాణ్ రామ్ డిఫరెంట్ మూవీలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచే వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్‌ని బాలయ్య ఫాన్స్ కొంత దూరం పెట్టిన మాట వాస్తవం. దీని వెనుక ఫ్యామిలీ పాలిటిక్స్‌తో పాటు వేరే కారణాలు కూడా వున్నాయి. తారక్, బాలయ్య మధ్య రిలేషన్‌షిప్ కూడా అంత బలంగా ఏమీ లేదన్నది అందరికీ తెలుసు. తారక్ తన సొంత ఇమేజ్, ఈజ్, పెర్ఫామెన్స్‌లతో తాతకు వారసుడిగా ఇండస్ర్టీలో ఫిక్సయిపోయాడు.
మొన్నటి ఎన్నికల సందర్భంలో పార్టీ ప్రచారానికి తారక్ దూరంగా వుండిపోవడంతో తనకి, బాలయ్యకి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోందని తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా చర్చించుకున్నారు. ఆమాటకొస్తే హైదరాబాద్ కూకట్‌పల్లి నుంచి పోటీచేసిన సందర్భంలో తన సోదరి ఎన్నికల ప్రచారంలోనే తారక్ పాల్గొనలేదు. ప్రస్తుతం సినిమాలు మినహా మరేదీ తనకు ప్రాధాన్యం లేని సబ్జెక్టుగా తారక్ భావిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాల్లో బాలయ్య తన వారసుణ్ని తీసుకొచ్చి తాతకు తనే మూడోతరం వారసుడిగా నిలబెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. బాలకృష్ణ కూడా తన అభిమానుల నుంచి తరచూ మోక్షజ్ఞ ఎప్పుడొస్తాడనే ఒకే ఒక ప్రశ్నను బాగా ఎదుర్కొంటున్నాడు.
ఇంతకీ అసలు మోక్షజ్ఞ సినిమా రంగప్రవేశం ఉంటుందా..? ఇంత సూటిగా అడిగితే ఈ ప్రశ్నకు ఇప్పటికిప్పుడు సమాధానం అయితే లేదు కానీ, ఒకటి మాత్రం ప్రస్తుతానికి నిజం. సినిమాల్లోకి రావడానికి మోక్షజ్ఞ అంత సుముఖంగా లేడని సమాచారం. సినీ రంగ ప్రవేశంపై తన మీద వత్తిడి పెట్టవద్దని మోక్షజ్ఞ ఇప్పటికే ఇంట్లో అందరికీ క్లారిటీ ఇచ్చాడని బాగా వినిపిస్తున్న టాక్. అతన్ని మూవీల్లోకి తీసుకురావడం తన అక్కలిద్దరికీ కూడా అంతగా ఇష్టం లేదని చెప్పుకుంటున్నారు. బావ లోకేశ్ కూడా మోక్షజ్ఞకు ఇష్టం లేని అంశంపై ఎవరూ వత్తిడి చేయవద్దని చెప్పినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ఈ విసయంలో చాలా లిబరల్. ఎవరి ఇష్టాల్నికాదనే తత్వం కాదు. ఈ లక్షణం అతనికి సీనియర్ యన్టీఆర్ నుంచి వచ్చింది. అప్పట్లో యన్టీఆర్ కూడా చిన్నవయసులోనే బాలకృష్ణ, హరికృష్ణలను సినీ రంగ ప్రవేశం చేయించినప్పటికీ వారిపై వత్తిడి తెచ్చి తీసుకురాలేదు. వారిద్దరి ఇష్టాల్ని తెలుసుకుని మాత్రమే తెరంగేట్రం చేయించారు. కాకపోతే, బాలయ్యను తన వారసుడిగా మాత్రం పదేపదే గర్వంగా చెప్పుకునేవారు. సినిమాల్లో అతనికి సుస్థిర స్థానం ఇవ్వడానికి ఎన్టీఆర్ మంచి మార్గదర్శకుడిగా వున్నారు. అలాగే మరో కుమారుడు మోహనకృష్ణను కూడా అతని ఆసక్తిని గమనించే కెమెరామెన్‌గా స్థానం కల్పించారు. ఇక, జయకృష్ణ, హరికృష్ణ నిర్మాణ రంగంలో ప్రతిభ చూపారు. బాలకృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్ మాదిరి గానే తన తనయుడు మోక్షజ్ఞ మూవీల్లోకి తీసుకొచ్చే విషయాన్ని అతని స్వేచ్చకే వదిలేశాడు.
కానీ ఫాన్స్ మాత్రం బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞని తీసుకు రావాలని తెగ హంగామా చేస్తున్నారు. తాజాగా మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ డిమాండ్ మరింత ఊపందుకుంది. కొన్ని కాలేజీల్లో సెలబ్రేషన్స్ జరిపి కాబోయే హీరో అంటూ బ్యానర్లు కట్టి బాగా హడావుడి చేశారు. ఇంతకీ మోక్షజ్ఞ మూవీల్లోకి వస్తాడా.. బాలయ్య అభిమానుల్ని అలరిస్తాడా? అనే ప్రశ్నకు సమాధానం కోసం కొంత కాలం ఆగాల్సిందే…!