హైదరాబాద్ లో కబ్జాసురల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. వితంతువు అని కూడా చూడకుండా ఓ మహిళను వేధిస్తున్నారు. పోలీసులు కూడా వారితో చేయి కలిపారని.. తమకు ప్రాణహాని ఉందని హెచ్చార్సీని ఆశ్రయించింది బాధిత కుటుంబం. బాలానగర్ ACP పురుషోత్తం, CI వహీదుద్దీన్ పై కంప్లయింట్ చేసింది.
హైదరాబాద్ బాలానగర్ శోభన కాలనీకి చెందిన లక్ష్మీ అనే వితంతువు.. ముగ్గురు పిల్లలతో 20 ఏళ్లుగా జీవనం సాగిస్తోంది. అయితే తాము ఉంటున్న ఇంటి స్థలాన్ని వదిలి వెళ్లిపోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోతోంది. కబ్జాదారులతో కుమ్మకై ACP, CIలు వేధిస్తున్నారని ఆరోపించింది. అదేమని అడిగితే కరెంట్, నీళ్లు కట్ చేసి.. మూడు రోజులుగా తమను బంధించారని కన్నీళ్లు పెట్టుకుంది.
పోలీసుల అండతో కబ్జాదారులు… రౌడీలతో ఇంటి ముందు బీభత్సం చేశారని అంటోంది బాధిత కుటుంబం. డయల్ 100కి కాల్ చేస్తే పోలీసులు.. అర్ధరాత్రి తమను సెటిల్ మెంట్ కోసం రమ్మంటున్నారని చెబుతోంది. తమకు ప్రాణహాని ఉందని హెచ్చార్సీకి ఫిర్యాదు చేసింది.
అయితే.. బాధితురాలు ఆరోపిస్తున్నట్లుగా పోలీసు అధికారుల పాత్రకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. 2020 డిసెంబర్ నెలలో ఉపేందర్ కోసం డాక్యుమెంట్స్ వర్క్ చేసే రాజు అనే వ్యక్తి నుండి ACP అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ను ఈమెయిల్ ద్వారా తెప్పించుకున్నట్లుగా ఆధారం ఉంది. అంటే గతేడాది డిసెంబర్ నుండే ACP ఈ వ్యవహారంలో తలదూర్చినట్టుగా భావిస్తున్నారు.
అలాగే.. పోలీసుల పాత్రను నిర్ధారించే ఆడియో రికార్డులు కూడా బయటపడ్డాయి. మొత్తంగా తామే సెటిల్ చేస్తున్నట్టుగా CIతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఎవరికి ఎంత ఇచ్చి సెటిల్ చేయాలో కూడా అందులో ప్రస్తావించారు. ఆడియోలో ACP పాత్ర కూడా ఉన్నట్టుగా CI ప్రస్తావించాడు.
కోర్టు విచారణలో ఉన్న సివిల్ వ్యవహారంలో పోలీసులు తలదూర్చి బాధితులకు అన్యాయం చేయడమే కాకుండా.. ఏకంగా స్థలాన్ని హస్తగతం చేసుకోవడానికి కబ్జాదారులతో కలిసి సెటిల్ మెంట్ వ్యవహారం నడిపించడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. పైగా బాధితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం.. ఖాళీ చేసి వెళ్లి పోవాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడటం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.